సిరి (విస్ఫారిత నేత్రాలతో అరిటాకు వంక చూస్తూ)
అమ్మమ్మా… ఇదంతా టిఫినా? మధ్యాహ్నం భోజనం కాదు కదా?
అమ్మమ్మ (నవ్వుతూ)
సంక్రాంతి పొద్దు అంటే ఇడ్లీ, దోశ అనుకున్నావా? పండగ నాడు పొట్ట ఖాళీగా ఉండకూడదంతే.
సూర్య: అసలు ఈ బ్రేక్ఫాస్టులు, లంచ్‌లు అని విడగొట్టి తినడం ఈ మధ్య వచ్చిన ఫ్యాషన్లు తల్లీ.
పృథ్వీ : మా చిన్నప్పుడు పొద్దున మొదలెడితే రాత్రి దాకా ‘నాన్‌స్టాప్ ‘. బ్రేకులు ఉండవు, ఆకలి అసలే ఉండదు.
వరుణ్ (నవ్వుతూ): కొత్త అల్లుడిగా వచ్చినప్పుడు నాకు అదే షాక్. పొద్దున్నే మీ ఇంట్లో గారెలు, బూరెలు, పొంగలి… ఒకటా రెండా? కడుపు నిండినా కళ్ళు ఆకలిగానే చూసేవి.
మేధ : వరుణ్ మావయ్యా, మరి మీ ఇంట్లో పద్ధతి ఎలా ఉండేది?
వరుణ్: మా ఇంట్లో సంక్రాంతి అంటే కొత్త బియ్యం పొంగలి వాసన గుప్పుమనాల్సిందే. ఆ ఘమఘమ లేకపోతే ఇంట్లో పండగ మొదలైనట్టే కాదు. ఆవు పాలతో చేసిన పరవన్నం. పొగలు గక్కుతూ, పొద్దున్నే…
జై (ఆశ్చర్యంగా): ఆవు పాలా? ప్యాకెట్ పాలు కాదా?
వరుణ్ (నవ్వుతూ): కాదురా బుజ్జిగా. అప్పట్లో పాలు ప్లాస్టిక్ కవర్లలో రావు, డైరెక్టుగా పాడి నుంచే వచ్చేవి.
అమ్మమ్మ: అందుకే ఆ రుచి ఇప్పటికీ గుర్తుండిపోయింది.
తాతయ్య (తల ఊపుతూ): కాలాన్ని, పంటని గౌరవించడం అంటే అదేరా.
అభిజీత్: మాకైతే సంక్రాంతి అంటే సకినాలే. తీపి కాదు, కారం కాదు… శబ్దం ముఖ్యం
ఆకాష్: శబ్దమా?
అభిజీత్: మరి! నములుతుంటే ‘కరక్ కరక్’ అని సౌండ్ రావాలి. పక్కింటోడికి వినిపించాలి మనం పండగ జరుపుకుంటున్నామని. ఆ మ్యూజికే వేరు.
(అందరూ గట్టిగా నవ్వారు)
సిరి (మృదువుగా): పండగ ఒక్కటే… కానీ తలా ఒక తీపి జ్ఞాపకం.
ఆనంది: ఈ టేబుల్ దగ్గర పదార్థాల కన్నా కథలే ఎక్కువ ఉన్నాయి.
అభిజీత్: పెళ్లయ్యాక గానీ నాకు అర్థం కాలేదు… కుటుంబాలు కలిస్తే పండగలు, పిండివంటలు కూడా డబుల్ అయితాయని.
తాతయ్య (అందరినీ కలయజూస్తూ): చూశారా… ఈ టేబుల్ దగ్గర ఇప్పుడు మూడు తరాలు కూర్చున్నాయి.
పృథ్వీ: కాలం మారుతోంది, రుచి మారుతోంది.
సూర్య: కానీ ఒకటి మాత్రం మారదు.
(నిదానంగా, అందరినీ గమనించి)
సిరి: అందరం కలిసి తినడంలోని ఆనందం.
(అమ్మమ్మ మనవరాలిని చూసి మురిసిపోతుంది)
అమ్మమ్మ: అదేరా సంక్రాంతి అంటే. విస్తట్లో వడ్డించింది అయిపోవచ్చు… కానీ ఈ జ్ఞాపకం మాత్రం కడుపు నింపి పంపిస్తుంది.