భోగి పండుగ ఉదయం. వీధిలో పండగ సందడి. టప టప టప… అంటూ డమరుకం శబ్దం లయబద్ధంగా వినిపించింది. కాళ్లకు గజ్జెలు, తలపాగా, నుదుట పెద్ద బొట్టుతో బుడబుక్కలాయన ప్రవేశించాడు
మాన్వి: (కళ్లు పెద్దవి చేసి, ఆశ్చర్యంగా) అమ్మమ్మోయ్! ఎవరూ ఈయన? రంగురంగుల బట్టలేసుకుని సర్కస్ బఫూన్లా ఉన్నాడు? జై: ఆ కోరమీసం చూడు ఎట్టా మెలేసాడో! చూడటానికి దడ పుడుతోంది కానీ, భలే విచిత్రంగా ఉన్నాడు. అమ్మమ్మ: (ముక్కు మీద వేలేసుకుని) ఏయ్! బఫూన్ అనకండిరా… పాపం తగులుతుంది. ఆయన బుడబుక్కలాయన. సంక్రాంతి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చే తొలి అతిథి ఆయనే. మేధ: అంటే సోది చెప్తారా అమ్మామ్మా? అమ్మమ్మ: సోది కాదు అమ్మలూ… శుభం పలుకుతారు. ఆ డమరుకం మోగించి ‘అంబ పలికింది’ అన్నారంటే, సాక్షాత్తు ఆ జగన్మాత పలికినట్టే. మనకి మంచి జరుగుతుందని సంకేతం.బుడబుక్కలాయన ‘జగదంబ పలికింది… అంతా మంచే జరుగుతుంది’ అంటూ వెళ్లిపోయాడు. వెంటనే వెనుక పగటి వేషగాళ్లు పౌరాణిక వేషధారణలో ప్రవేశించారు.
ఆకాష్: తాతయ్యా! ఇదంతా జస్ట్ మేకప్పేనా? లేక నిజంగానే వీళ్లకి ఏమైనా మహిమలు ఉంటాయా? తాతయ్య: (చిరునవ్వుతో) చూసే కళ్ళల్లో భక్తి ఉంటే దేవుళ్లు, లేకపోతే కేవలం మనుషులు రా. నమ్మకమే ఇక్కడ అసలైన శక్తి. సిరి: (చప్పట్లు కొడుతూ) హేయ్! అదిగో రాముల వారు! పక్కన తోకతో హనుమంతుడు! ఆనంది: వీళ్లే పగటి వేషగాళ్లు. మన పురాణాలని కళ్లకు కట్టినట్టు చూపిస్తారు. జై: అబ్బా! అచ్చం సినిమాల్లో గ్రాఫిక్స్ లానే ఉందిరా యాక్షన్! తాతయ్య: (గంభీరంగా) ఇప్పుడు మీకు గ్రాఫిక్స్… మాకు అప్పట్లో ఇవే ఇతిహాసాలు. ఈ వీధే మాకు రంగస్థలం, ఆ పద్యాలే మాకు పాఠాలు. అమ్మమ్మ: అవున్రా… టీవీలు లేని కాలంలో రామాయణమైనా, భారతమైనా వీళ్లు ఆడిపాడితే చూసి నేర్చుకున్నదే. మేధ: ఓహో! అయితే ఇది ఓపెన్ స్కూల్ అన్నమాట!వేషగాళ్లు పద్యం పాడుతుంటే జనం లీనమై వింటున్నారు
ఆకాష్: కానీ తాతయ్యా, ఇప్పుడు ఇలాంటివన్నీ మాయమైపోతున్నాయి కదా… ఇంకెన్నాళ్లు ఉంటాయో? తాతయ్య: (నిట్టూరుస్తూ) కాలం మారుతోంది నాన్నా. కానీ బంగారం పాతబడినా దాని విలువ తగ్గదుగా? ఇదీ అంతే… ఇవి కేవలం ఆటలు కాదు, మన సంస్కృతికి వేర్లు. మాన్వి: (అమ్మమ్మ కొంగు పట్టుకుని) మరి వచ్చే సంక్రాంతికి మళ్ళీ వస్తారా అమ్మామ్మా? అమ్మమ్మ: (మాన్వి తల నిమురుతూ) మీరు ఇలా ఆసక్తిగా చూస్తామంటే… వాళ్లు రాకుండా ఎందుకుంటారు? మీ ఆదరణే వాళ్ళకి ఆక్సిజన్.(పిల్లలు ఆలోచనలో పడగా, బృందం ముందుకు సాగింది.)