ఈ మధ్య భోగి మంటల్ని చూస్తుంటే… ఏంటో, మంట చిన్నదైపోయిందేమో అనిపిస్తోంది.
తాతయ్య (కాఫీ సిప్ చేస్తూ, చిరునవ్వుతో):మంట చిన్నది కాలేదు… పోటీపడి పెద్ద మంటలు వేసేది ఎవరు ఇప్పుడు
అమ్మమ్మ (ఆయన వైపు చురుగ్గా చూస్తూ):మా చిన్నప్పుడు భోగి మంటంటే… ఆకాశాన్ని తాకుతున్నట్టు, ఆరు ఏడు అడుగుల ఎత్తులో ఉండేది.
తాతయ్య: అవునులే… కానీ అది కేవలం మంట కాదు. అదొక యజ్ఞం.ముందు రోజు గొయ్యి తవ్వడం, చుట్టూ పేడతో కళ్ళాపి చల్లడం… మంచు కురుస్తుండగా తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి దీపం పెట్టడం…
అమ్మమ్మ: అప్పట్లో చలి కూడా ఎముకలు కొరికేసేలా ఉండేది కదా.తాతయ్య: ఉండేది. కానీ ఆ మంట చుట్టూ చేరి కూర్చుంటే… ఆ ఆత్మీయతల వెచ్చదనంలో చలి అసలు గుర్తుకే వచ్చేది కాదు.
అమ్మమ్మ (నవ్వుతూ): అందరూ కబుర్లు చెప్పుకుంటూ… ఒకపక్క మగవాళ్ళు, మరోపక్క పిల్లలు…తాతయ్య: పిల్లలు కాదు… పిడుగులు! దొడ్లో ఉన్న పాత మంచాలు, విరిగిన కుర్చీలు… ‘తెల్లారేసరికి మాయం అయిపోయాయేంట్రా’ అని ఇంట్లో వాళ్ళు తల పట్టుకునేవారు.
అమ్మమ్మ (మెల్లగా నవ్వుతూ): వట్టి ఆకతాయి పనులు. తాతయ్య: ఆకతాయి పనులే. కానీ అప్పట్లో ‘వృథా’ అనే మాటే లేదు. ఎండు పుల్ల, రాలిన ఆకు, పిడక… ప్రతీదీ పనికొచ్చేదే. అమ్మమ్మ (ఆలోచనగా): ఇప్పుడు ‘రీసైక్లింగ్’ అని ఇంగ్లీషులో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. అప్పట్లో మనకది జీవన విధానం. తాతయ్య (తల ఊపుతూ): అక్షరాలా నిజం. సంక్రాంతి అంటే నాకు అదే. కాలం మారడం కాదు… కాలంతో పాటు మనమూ, మన అలవాట్లు మారడం.(ఇద్దరూ కాసేపు మౌనంగా భోగి మంట తాలూకు బూడిదను చూస్తుంటారు)
అమ్మమ్మ (ఆర్ద్రంగా): మనకి తెలియకుండానే… ఆ మంటల్లోంచి ఎంతో నేర్చుకున్నాం కదండీ. తాతయ్య: అవి నేర్చుకోవడానికి పెట్టిన పాఠాలు కాదు… జీవించడానికి వేసిన బాటలు.