Edit Template

సంక్రాంతి ఎండాకాలంలో
ఎందుకు రాదు ?

© 2025 Telugillu
Celebrating Telugu heritage

Edit Template

సంక్రాంతి ఎండాకాలంలో ఎందుకు రాదు?

Ananth, Medha, Siri, Jai, Manvi

సాయంకాలం మసక చీకటి పడుతోంది. పగలంతా హడావిడి ముగిసాక తోటలో నిశ్శబ్దం అలుముకుంది. గడ్డి మీద పచ్చిక ఇంకా చల్లగానే ఉంది. తాతయ్య ఒక చెక్క కుర్చీలో కూర్చుని, రెండు చేతులు రుద్దుకుంటూ వెచ్చదనం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆనంది నెమ్మదిగా వచ్చి ఆయన భుజాల మీద శాలువా కప్పింది.

  ఆనంది: “ఏంటి తాతయ్యా… ఈ ఏడాది చలి మరీ ఎముకలు కొరికేస్తోంది.” తాతయ్య: (నవ్వుతూ) “ఆ చలే లేకపోతే ఈ సంక్రాంతికి అందం, ఆనందం ఏముంటుందమ్మా?”

మేధ, సిరి వచ్చి మెట్ల మీద కూర్చున్నారు. జై, మాన్వి కాసేపు అటూ ఇటూ పరుగెత్తి, అలసిపోయి నెమ్మదించారు.

జై: (గభాల్న ఆగి, సీరియస్‌గా) “తాతయ్యా… నాకో చిన్న ధర్మ సందేహం!” తాతయ్య: “అదేంటో సెలవిచ్చుకోరా.” జై: “అసలు ఈ సంక్రాంతిని ఇప్పుడే ఎందుకు చేసుకోవాలి? ఈ వణికించే చలిలో కాకుండా… హాయిగా ఎండాకాలంలో చేసుకోవచ్చుగా?” మాన్వి: (తల ఊపుతూ) “అవును తాతయ్యా… అప్పుడైతే పుల్లపుల్ల ఐస్‌క్రీములు కూడా ఉంటాయి!” అందరూ నవ్వారు. తాతయ్య: (ఆకాశం వంక, తర్వాత జై వంక చూస్తూ) “బలే చిక్కు ప్రశ్న వేశావురా… కానీ అసలు విషయం ఏంటంటే… సంక్రాంతి పండగ వాతావరణం కోసం కాదు, కాల గమనం కోసం.” సిరి: “కాల గమనం అంటే?” తాతయ్య: “ఈ రోజు నుంచే సూర్యుడు తన దారిని మార్చుకుంటాడు. ‘ఉత్తరాయణం’ పుంజుకుంటుంది.” సిరి: “అంటే నార్త్ సైడ్ వెళ్తాడనా?” తాతయ్య: “అంతేగా. మన మాటల్లో చెప్పాలంటే… ఇక నుంచి పగలు సాగుతుంది, చీకటి తరుగుతుంది. వెలుతురు గెలిచే సమయం ఇది.” ఆనంది: “అంటే ఎండ బాగా కాస్తుందన్నమాట.” తాతయ్య: “కరెక్ట్. చలి ముదిరిపోయాక… శరీరానికి కాస్త విశ్రాంతి దొరికే సమయం ఇది.” జై: (అర్థం కాక) “విశ్రాంతా?” తాతయ్య: “ఈ సమయంలో, ఈ చలిలో మనం నెమ్మదిస్తాం. చలికి బిగుసుకుపోయిన ప్రాణానికి… ఆ భోగి మంట, ఆ కొత్త ఎండ, ఆ పిండి వంటలు… అన్నీ ప్రాణం పోస్తాయి. తినడం, కలవడం, ఆరుబయట గడపడం… అంతా హాయిగా ఉంటుంది.” సిరి: “ఓహో… అంటే ఫెస్టివల్ మనల్ని కదిలిస్తుందన్నమాట?” తాతయ్య: “కదిలిస్తుంది… లాలించి లేపుతుంది.” మేధ: ” కదా పంటలు కూడా ఇప్పుడే ఇంటికి వస్తాయి?” తాతయ్య: (తల ఊపుతూ) “అక్షరాలా నిజం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చాక… కృతజ్ఞత చెప్పుకోవాలిగా? ప్రకృతికి, సూర్యుడికి, ఈ నేల తల్లికి.” మాన్వి తోట వైపు చూసింది. మాన్వి: “అంటే… సంక్రాంతి నేచర్‌కి మనం ఇచ్చే ‘థాంక్యూ పార్టీ’ అన్నమాట!” తాతయ్య: (చిన్నగా నవ్వి) “అచ్చం అలానే అనుకో అమ్మా.” ఆనంది: “అందుకేనేమో… ఈ చలిలో గొబ్బెమ్మలు, భోగి మంటలు అన్నీ భలే అనిపిస్తాయి.” సిరి: “నిజంగా మన పెద్దవాళ్ళు పండగని చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు కదా!” తాతయ్య: “మన పూర్వీకులు వాతావరణంతో యుద్ధం చేయలేదు తల్లీ… దాంతో స్నేహం చేశారు.” జై ఒక్క నిమిషం ఆలోచించాడు. జై: “అంటే సంక్రాంతి అంటే… వింటర్‌ని కొట్టడం కాదు…” తాతయ్య: “శీతాకాలాన్ని గుండెలకు హత్తుకోవడం!” నిశ్శబ్దం. తోటలో ఎందుకో వెచ్చగా అనిపించింది. మాన్వి: (నవ్వుతూ) “నాకు ఈ వింటర్ సంక్రాంతే నచ్చింది తాతయ్యా.” తాతయ్య: (శాలువా సరిచేసుకుంటూ) “అది అర్థమైతే… పండగ మొదలైనట్టే!”

సంక్రాంతి ఎండాకాలంలో
ఎందుకు రాదు ?

కావలసిన పదార్ధాలు
తయారి విధానం
[real3dflipbook id='1']