ప్రధాని మోడీ పంజాబ్లో అడుగు పెట్టకుండా రైతులు అడ్డుకున్నారు. ఏడాది పాటు రాజధాని ఢిల్లీలో వాళ్లు అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏకంగా కుటుంబాలకు కుటుంబాలే రోడ్డుపై కొచ్చాయి. 700 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చట్టాలను భేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన త్వర్వాతనే వెనుదిరిగారు. అవే చట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ఇటీవల వ్యాఖ్యానించారు. తాము కూడా ఉద్యమాన్ని తాత్కాలికంగానే విరమించినట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి. మళ్లీ సాగు చట్టాలను తెస్తే మళ్లీ ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇప్పుడు పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ, గోవా, మణిపూర్ ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని హాజరయ్యే కార్యక్రమానికి 70 వేల మంది వస్తారని అంచనా. దీన్ని తల్లకిందులు చేస్తూ పట్టుమని వెయ్యి మంది కూడా లేక కుర్చీలు వెలవెలబోయాయి. ఓవైపు రైతుల నిరసన.. మరోవైపు జనం లేని సభ. ప్రధాని మోడీ వెనుతిరిగారు. హాజరైతే పరువు పోయేది. దాన్ని కవర్ చేసుకునేందుకు రైతుల నిరసనను అడ్డు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. తాను ప్రాణాలతో బయటపడ్డానని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. తాను క్షేమంగా తిరిగి ఢిల్లీ చేరినందుకు పంజాబ్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని సభకు హాజరు కాకపోవడానికి సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమేనని ఆరోపిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఈ ఘటనపై స్పందిస్తూ ప్రధాని మోడీ సభకు జనం రాకపోవడం వల్ల ఆయన హాజరు కాకుండా వెనుదిరిగి వెళ్లారు. అందుకు తమను బద్నాం చేయడం తగదని కేంద్రానికి సమాధానమిచ్చారు. ఇప్పుడే ఇలా ఉంటే ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో స్పష్టమవుతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ఏం చేయాలో అర్థంగాక కమలనాధులు తల పట్టుకుంటున్నారు.