తెలంగాణలో రాజకీయాలు ఎన్నికలను తలపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు వరుస కార్యక్రమాలతో జనంలోకి దూసుకుపోతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారు. మహబూబ్ నగర్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మే6న వరంగల్ లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు హాజరయ్యారు. ఈరెండు పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నా గులాబీ బాస్ నుంచి స్పందన లేదు. ఫాం హౌజ్‌లో అంత బిజీ ఏంటని జనం చర్చించుకుంటున్నారు.
వరంగల్ సభలో రాహుల్ గాంధీ కేసీఆర్ పేరు ఎత్తకుండానే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను రాజుగా అభివర్ణించారు. తెలంగాణ ప్రజల ద్రోహి అన్నారు. ఇక జేపీ నడ్డా కూడా కేసీఆర్ లక్ష్యంగానే మాట్లాడారు. నియంత పాలనలో కేసీఆర్ నిజాంను మించి పోయారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇంత రచ్చ సాగుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మంత్రులంతా విపక్షాల ఆరోపణలకు కౌంటరిస్తున్నారు. కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు.
ఫాంహౌజ్‌కే ఎందుకు పరిమితమయ్యారు !
దాదాపు 10 రోజులుగా సీఎం కేసీఆర్ యాక్టివిటీస్ లేవు. ఏప్రిల్ 27న మాదాపూర్ హైటెక్స్ లో జరిగిన పార్టీ ప్లీనరీలో పాల్గొన్నారు కేసీఆర్. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ప్రగతి భవన్ నుంచి బయటికి రాకున్నా.. కనీసం లోపల సమీక్షలు జరిపినట్లు కూడా సమాచారం లేదు. సీఎం మానసపుత్రిక యాదాద్రి ఆలయం వర్షానికి ఆగమాగమైంది. విపక్షాలు పెద్ద ఎత్తున రచ్చ చేశాయి.
అయినా యాదాద్రిలో ఏం జరిగిందో కనీసం ఆరా తీయలేదు. కేసీఆర్ ప్రగతి భవన్ లో కాకుండా ఫాంహౌజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇంత రాజకీయ రచ్చ జరుగుతున్నా కేసీఆర్ ఫాంహౌజ్ లో సైలెంట్ గా ఎందుకు ఉన్నారనేది చర్చగా మారింది. కేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో పలు వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ బలోపేతం.. వ్యూహాలపై చర్చల్లో నిమగ్నం
పార్టీ బలోపేతం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ ఫాం హౌజ్‌లో వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీకే టీమ్ ఇచ్చిన నివేదికలపై ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. ఇక జాతీయ స్ఠాయిలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపైనా కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ముఖ్యనేతల సూచనలు తీసుకుంటున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్, బీజేపీకి మద్దతు ఇవ్వకుండా ప్రాంతీయ పార్టీల తరపున మూడో అభ్యర్థిని నిలబెట్టాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చల్లో బిజీగా ఉండటం వల్లే కేసీఆర్ మౌనంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Share and Contribute. Encourage Independent Journalism
