బస్సులో ప్రయాణం. ఓ చిన్నారి కథ చెప్పమని అమ్మను మారాం చేస్తుంది. ఒక ఊరిలో రాజంటూ అమ్మ కథ మెదలెడుతుంది. పాపకు నచ్చదు. వేరే కథ చెప్పమంటుంది. అవతల సీటులో కూర్చున్న ఓ నర్స్ తాను చెబుతానంటుంది. అనగనగా ఓ సిపాయి. అతని ప్రాణం ఓ చేపలో ఉంటుంది. చేప కోసం సిపాయి బయల్దేరతాడు. పర్వతాలు, నదులు, సప్త సముద్రాలు వెదుకుతుంటాడు. చేప కనిపించదు. వెదుకుతూనే ఉన్నాడు. పాప నిద్రలోకి జారుకుంది. బస్సులో ఎవరో మూర్చతో పడిపోతారు. నర్సు తాళాల గుత్తి అడుగుతుంది. ఎవరి దగ్గరా లేవు. నర్సు మెడలో గవ్వ చైన్‌ను తీసి ఆమె చేతిలో పెడుతుంది. తర్వాత బసు దిగి వెళ్లిపోతుంది. ఆ చైన్‌ను పాప జాగ్రత్తగా దాచుకుంటుంది. అక్కడ నుంచి ‘మార’ సినిమా కథ మొదలవుతుంది.
పాప పేరు పారు (శ్రద్ధా శ్రీనాథ్). పెద్దయ్యాక పాత దేవాలయాలు, భవనాలను పునరుద్దరించే పనిచేస్తుంటోంది. పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. వాటి నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. ఓ రోజు నాడు నర్సు చెప్పిన కథ కళ్ల ముందు కదిలాడుతుంది. అనుకున్నదే తడవుగా బయల్దేరుతుంది. ఓ ఊళ్లో పాత భవనాలకు వేసిన చిత్రాలు తను విన్న కథను పోలి ఉండడాన్ని గమనిస్తుంది. ఆ పెయింటింగ్స్ వేసిందెవరని ఆరా తీస్తుంది. మారా(మాధవన్) అని తెలుస్తుంది. అతని కోసం వెదుకుతూ అతను ఉండే ఇంటికి చేరుతుంది. అక్కడ మారా ఉండడు. అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు. గైడ్ సహకారంతో పారు ఆ ఇంట్లోనే బస చేస్తుంది.
అక్కడ ఆమెకు మారా గీసిన అనేక చిత్రాలు లభ్యమవుతాయి. వాటి ద్వారా ఓ దొంగ, ఓ వ్యభిచారిణి, అతని కూతురు రాణి గురించి వాకబు చేస్తుంది. వాళ్లతో మారాకు ఉన్న సంబంధాల గురించి విశ్లేషిస్తూ.. వాళ్లను కలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో మారాతో సంబంధం ఉన్న డాక్టర్ హనీని వెదుకుతూ మరో పల్లెటూరుకు చేరుతుంది. అది రిటైర్డ్ పోస్టు మాస్టర్ వెంకయ్య నివాసం. అక్కడ అతని స్నేహితులు, వాళ్ల పిల్లలతో గడుపుతుంటాడు.

పారుకు రాణి అక్కడే తారసపడుతుంది. డాక్టర్ హనీని కలుసుకుంటుంది. డాక్టర్ హనీ ఓ ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడంతో పదేళ్ల పిల్ల చనిపోతుంది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు మారా ఆమెను వారించి నివారిస్తాడు. ఇప్పుడు డాక్టర్ హనీ కూడా వెంకయ్య నివాసంలోనే కాలం వెళ్లదీస్తుంటుంది.
మారా బాలుడుగా ఉన్నప్పుడు ఓ ట్రైన్లో వెంకయ్యకు తారసపడతాడు. మారాకు నాఅనే వాళ్లెవరూ లేరు. ట్రైన్లో చిత్రాలు గీసుకుంటూ వెళ్తుంటాడు. ఏదైనా పనిస్తే చేస్తానంటాడు. వెంకయ్యతోపాటు అతని ఊరికి చేరతాడు. అక్కడ కుదురుగా ఉండడు. ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం వరదల్లో కొట్టుకుపోయిన వెంకయ్య ప్రియురాలు మీనాక్షి గురించి వెదుకుతుంటాడు. వెంకయ్య నివాసంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ కథను పారు తెలుసుకుంటుంది.
వెంకయ్య ప్రియురాలు మీనాక్షి ఫొటో చూస్తుంది. అప్పుడే మారా ఫొటోను కూడా వెంకయ్య పారుకు చూపిస్తాడు. బాల్యంలో తనకు కథ చెప్పిన నర్సు మేరీనే మీనాక్షి అని గుర్తిస్తుంది. వెంకయ్య పుట్టిన రోజున మీనాక్షిని తీసుకొచ్చి వెంకయ్య దగ్గరకు చేరుస్తుంది. అప్పటి వరకు పారు గురించి వినడమే తప్ప తెలియని మారా పారును కలుసుకుంటాడు. ఆ ఉద్విక్త క్షణాలు ఇరువురి మనసులో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వెల్లడిస్తాయి. కథ సుఖాంతమవుతుంది.
మార చిత్రంలో పాత్రలకు ప్రాధాన్యం లేదు. కథ మాత్రమే ఉంటుంది. కథే సినిమాకు ప్రాణం పోస్తుంది. మూసలో చిక్కుకున్న నటులు మారలో నటించలేరు. అది తమిళ తంబీలకే సాధ్యమైంది. మళయాళంలో చార్లీ చిత్రానికి తమిళంలో రీమేక్ చేశారు. అనంతరం తెలుగులో డబ్ చేశారు. మాధవన్, శ్రద్ధా శ్రీనాధ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధిలీప్‌కుమార్ దర్శకత్వంలో ప్రతీక్ చక్రవర్తి, శ్రుతి నల్లప్ప చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో కథా నాయకుడు, నాయికలు చివరిదాకా ఒకరినొకరు చూసుకోరు. కలుసుకోరు. వాళ్లు కలుసుకోవడంతో చిత్రానికి శుభం కార్డు పడుతుంది. సినిమాలో చూపిన లొకేషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. వివిధ పాత్రల ప్రవేశం కూడా దర్శకుడి ప్రతిభను చాటుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ చూడొచ్చు.