తెలుగు దేశం పార్టీ మేథో మదనం.. కార్యాచరణ వేదిక మహానాడు. ఆ వేదిక నుంచే టీడీపీ విధి విధానాలను చర్చిస్తుంది. తగిన కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు సాగుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మహానాడు 27,28 తేదీల్లో నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తిరుపతి, కృష్ణా జిల్లాలో నిర్వహించారు. ఈ దఫా కాకినాడలో పెట్టాలని తొలుత భావించారు. చివరగా ఒంగోలు వేదికగా నిర్ణయించారు.
ఒంగోలులో మహానాడు నిర్వహించడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొంత లోతుగా పరిశీలిస్తే.. సీఎం జగన్ సొంత జిల్లా తర్వాత ఆయన బంధువర్గం ఉండేది ప్రకాశం జిల్లాలోనే. వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయాలను శాసించింది ఇక్కడే. ఇక్కడ నుంచే యుద్ధభేరీ మోగించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించి ఉండొచ్చు.
రాష్ట్ర వ్యాప్తంగా పోల్చుకుంటే అధికార పార్టీ వైఫల్యాలు కూడా ఇక్కడ ఎక్కువే. అధికారానికి వచ్చిన ఏడాదిలో వెలుగొండ ప్రాజెక్టు తొలి సొరంగం నుంచి నీళ్లిస్తామన్నారు. ఇంకా నీళ్లు రాలేదు. జిల్లాలో ఇంకా పెండింగ్ ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తవలేదు.
ఒంగోలు నగరానికి రోజూ తాగునీటి సరఫరా కోసం టీడీపీ హయాంలో రూ.123 కోట్లతో ఓ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వం మారిన తర్వాత అది అటకెక్కింది. ఆర్నెల్ల క్రితం సీఎం జగన్ రూ.400 కోట్లతో మరో స్కీం ప్రకటించారు. దాని విధి విధానాలు, నిధులు ఎక్కడ నుంచి ఇస్తారనేది ఇప్పటికి స్పష్టత లేదు.
వైఎస్ జగన్ గాలిలోనూ 4 స్థానాలు దక్కించుకుంది..
ఇక రాజకీయంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గత ఎన్నికల్లో టీడీపీ 4 స్థానాలు గెల్చుకుంది. విశాఖ, కృష్ణా జిల్లా తర్వాత ప్రకాశంలోనే అన్ని సీట్లు వచ్చాయి. నేడు ప్రతిపక్షంలో ఉండి కూడా దర్శి నగర పంచాయతీని కైవసం చేసుకుంది.
అందువల్ల టీడీపీ ఓటు బ్యాంకు ఈ జిల్లాలో చెక్కు చెదరలేదు. కరణం బలరాం లాంటి నాయకులు పార్టీ మారినా పార్టీ బలం తగ్గలేదు. ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పార్టీ ఎప్పటినుంచో భావిస్తోంది. అందుకు మహానాడును వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఒంగోలులోనే మహానాడు నిర్వహించడంపై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. గతంలో పెద్ద నగరాలకు సమీపంలో పెట్టేది. ఈసారి వెనుకబడిన ప్రాంతాల్లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.
ఒంగోలు అయితే అటు రాయలసీమ జిల్లాలకు దగ్గరగా ఉంటుంది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు సమ దూరంలో ఉంటుందని భావించినట్లు రవికుమార్ వెల్లడించారు. ప్రజల్లోకి పార్టీని మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి మహానాడు వేదికగా తీసుకునే నిర్ణయాలు దోహదపడతాయని గొట్టిపాటి వివరించారు.
Share and Contribute Rs.100
Encourage Independent Journalism
